||సుందరకాండ. ||

||తత్త్వదీపిక-యాభైరెండవ సర్గ||

||"క్షమస్వ రోషం త్యజరాక్షసేంద్ర"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్విపంచాశస్సర్గః||

తత్త్వదీపిక
ఏబది రెండవ సర్గ
"క్షమస్వ రోషం త్యజరాక్షసేంద్ర"


"క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర" అంటే
'రాక్షసేంద్రా క్షమించుము, రోషమును విడువుము.'

ఇవి విభీషణుని మాటలు

సుందరకాండలో విభీషణుడు ప్రవేశించడము ఇదే మొదటి సారి.
త్రిజట తన స్వప్నవృత్తాంతములో విభీషణుని గురించి చెపుతుంది.
'ఏకః తత్ర మయా దృష్టః శ్వేతఃఛత్రో విభీషణః'
రావణుని దుర్దశ వివర్ణిస్తూ త్రిజట విభీషణుని గురించి కూడా చెపుతుంది.

విభీషణుడు తెల్లని వస్త్రములతో
తెల్లని ఛత్రముతో కనిపించాడు అని అంటుంది.
తెలుపు రంగు శుభసూచకము.
అంటే త్రిజట కల విభీషణునికి శుభము, రావణునికి అశుభము సూచిస్తుంది.

తరువాత సీతమ్మ హనుమంతునితో తన సంభాషణలో,
విభీషణుడు ' రామునకు తనని తిరిగి సమర్పించమనే ప్రయత్నము' చేశాడని అంటుంది.
అంటే విభీషణుడు సీత వృత్తాంతము, మంచి చెడ్డలు తెలిసినవాడన్నమాట.
ఇక జరుగుతున్న కథ చూద్దాము.

ఈ సర్గ లో మొదటి పాదము
"తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః" అని .
అంటే మహాత్ముడైన హనుమంతుని హిత వాక్యములను విని
రావణుడు క్రోధమూర్ఛితుడై హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపించెను అని.

విభీషణునికి దూతను చంపుట అధర్మము అని తోచెను.
కార్యములను సరిగా చేయు విభీషణుడు,
రాజు వధించమని ఇచ్చిన ఆజ్ఞ విని, ఏమి చేయవలెను అని ఆలోచించెను.
అప్పుడు తన ఆలోచనలలో నిశ్చయమునకు వచ్చి
శత్రువులను జయించు, వాక్య విశారదుడు అగు విభీషణుడు
తన అగ్రజునితో ఎంతో హితమైన వచనములతో ఇట్లు పలికెను.

' ఓ రాక్షసేంద్ర ! క్షమించుము.
రోషమును విడువుము.
నా మాటలను వినుము'.
'రాజ్యములు ఏలువారు ఉచితానుచితములు ఎరిగినవారు, దూత వధ చేయరు.
ఓ వీరుడా ! ఆ కపిని వధించుట రాజధర్మమునకు విరుద్ధము.
అది లోకములో నిందించబడు కార్యము.
అది నీకు తగని పన'.

'నీవు ధర్మజ్ఞుడవు.
కృతజ్ఞత గురించి తెలిసిన వాడవు.
రాజధర్మములో విశారదుడవు.
ప్రాణులతో వ్యవహరించు విధానములు తెలిసినవాడవు'.

నీలాంటి విచక్షణ గలవారు కోపముతో ప్రవర్తిస్తే,
శాస్త్రజ్ఞానము సంపాదించుట కేవలము శ్రమయే అగును.
ఓ రాక్షసేంద్రా ! శతృవులను వధించువాడా ! నిగ్రహించుము.
యుక్తాయుక్తములను ఆలోచించి అప్పుడు దూతకు దండనము విధించవలెను'.

ఆ రాక్షసేశ్వరుడు రావణుడు విభీషణుని వచనములను విని
మహత్తరమైన రోషముతో ఈ విధముగా ఉత్తరమిచ్చెను.
'ఓ శత్రుసూదనా ! పాపులను వధించుట పాపము అనబడబోదు.
ఈ పాపములు చేసిన వానరుని అందువలననే వధించవలెను '.

రావణుని సమాధానము బహు దోషములతో కూడినది,
అధర్మమునకు మూలమైనది.
బుద్ధిమంతులలో వరిష్ఠుడు విభీషణుడు,
ఆర్యులచేత ఆదరింపబడని ఆ వచనములను వినిన విభీషణుడు,
పరమార్థయుక్తమైన వచనములను పలికెను.

' ఓ రాక్షసేంద్రా ! లంకేశ్వరా ! దయచేసి ప్రసన్నుడవు అగుము.
ధర్మముతో కూడిన వచనములను వినుము.
ఓ రాజన్ ! సంతులు సర్వత్ర ఈ విధముగా చెపుతారు'.

'అన్ని సమయములలోనూ దూతలు వధింపతగని వారు.
అశంసయముగా ఇతడు హద్దుమీరిన శత్రువు.
ఇతనిచేత అసమానమైన అప్రియము చేయబడెను.
అయినా సంతులు దూతను వధించమని చెప్పరు'.

'దూతలకు విధింపతగు దండములు చాలా వున్నాయి.
అంగవైరూప్యము , కొరడాతో కొట్టడము, ముండనము చేయడము,
శరీరము మీద ముద్రలు వేయడము.
ఇవన్నీ దూతలకి ఇవ్వ తగిన దండములు అని సంతులు చెపుతారు.
దూతల వధమాత్రము చెప్పబడలేదు.'

'ధర్మార్థములు ఎరిగినవారు యుక్తాయుక్తములను చూచి
అప్పుడే నిశ్చయమునకు వచ్చుదురు.
నీలాంటి వారికి కోపము వస్తే ఎలాగ ?
సత్త్వము గలవారు కోపమును అదుపులో ఉంచెదరు'.

'ఓ వీర ! ధర్మవాదములోనూ, లోకజ్ఞానములోనూ,
శాస్త్రములను అర్థము చేసుకొనుటలోనూ నీతో సమానులు లేరు.
నీవు సురాసురులలో ఉత్తముడవు'.

'ఓ నిశాచరేంద్రా ! నీవు సురులు అసురులకు కూడా దుర్జయుడవు.
ప్రగల్భములు పలుకు సురదైత్య సంఘములు,
అలాగే నరేంద్రుడూ యుద్ధములో నీ చేత జయించబడినవారు.
ఈ కపిని వధించుటలో ఒక మంచి గుణము కనపడుట లేదు.
ఈ కపిని ఇక్కడికి పంపించిన వారు దండనీయులు'.

'ఇతడు సాధువా కాడా అన్నది చర్చనీయము కాదు.
ఇతడు ఇతరులచేత పంపబడిన దూత.
ఇతరులచేత సందేశము ఇచ్చుటకు పంపబడిన దూత వధింప తగడు'.

'ఓ రాజన్ ! ఇతనిని చంపినచో ఈ మహాసాగరము దాటి
ఇక్కడికి రాగలవాడు మరొకడు నాకు కనపడుటలేదు.
ఓ పరపుంజయ ! అందువలన ఇతనిని వధించు ప్రయత్నము చేయరాదు'.

'నీవు ఇంద్రునితో సహా దేవతలతో యుద్ధము చేయుటకు తగినవాడివి.
ఓ యుద్ధప్రియుడా ! ఇతనిని వధించినచో
దుర్వినీతులు సుదూరములో ఉన్న ఆ రాజపుత్రులనిద్దరినీ
యుద్ధమునకు ప్రేరేపింపగల ఇతర దూతలు నాకు కనపడుటలేదు'.

'రాక్షసుల మనస్సు రంజింపచేయు రాజా !
సురాసురులని జయింపగల నీవు
యుద్ధమునకు అవకాశమును పోగొట్టుకొనుట యుక్తము కాదు'.

'హితులు, శూరులు, మహాగుణములు కల కులములలో పుట్టినవారు,
శస్త్రధారులలో శ్రేష్ఠులు కోట్లకొలది నీ పరివారములో ఉన్నారు.
వారు నీ ఆదేశముతో ఒక బలగము తీసుకుపోయి,
ఆ మూఢులైన రాజపుత్రులను జయించి
నీ ప్రభావము చూపించుటకు వేచియున్నారు'.

నిశాచరులలో సురలోకమునకు శత్రువు,
మహాబలుడు రాక్షసరాజులలో ముఖ్యుడు అగు రావణుడు,
తన తమ్ముడగు విభీషణుని ఉత్తమమైన వచనములను విని,
ఆ వచనములను పాటించవలెనని తలచెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో యాభైరెండవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||